ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌కు విజయ్ శంకర్ గుడ్ బై.. కారణం ఇదే!

  • కొత్త అవకాశాల కోసం విజయ్ శంకర్ రిటైర్మెంట్
  • విదేశీ లీగ్ లు ఆడేందుకు వీలుగా రిటైర్మెంట్ నిర్ణయం
  • 2019 ప్రపంచకప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం
  • 15 ఏళ్ల పాటు సాగిన సుదీర్ఘ దేశవాళీ కెరీర్‌కు ముగింపు
  • ఐపీఎల్ 2026 వేలంలో అమ్ముడుపోని ఆల్‌రౌండర్
భారత క్రికెట్ ఆల్‌రౌండర్ విజయ్ శంకర్, దేశవాళీ క్రికెట్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. విదేశాల్లో కొత్త క్రికెట్ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశాడు. 15 ఏళ్ల తన సుదీర్ఘ దేశవాళీ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు శుక్రవారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.

"క్రికెట్టే నా జీవితం. 10 ఏళ్ల వయసులో ఆడటం ప్రారంభించి, 25 ఏళ్ల తర్వాత అన్ని స్థాయిల్లో ఆడే అవకాశం దక్కినందుకు కృతజ్ఞుడిని. ఇప్పుడు కొత్త అవకాశాల కోసం దేశవాళీ క్రికెట్, ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతున్నాను" అని తన ప్రకటనలో పేర్కొన్నాడు. 35 ఏళ్ల విజయ్ శంకర్ 2012లో తమిళనాడు తరఫున తన కెరీర్ ప్రారంభించి, చివరిగా 2025-26 సీజన్‌లో త్రిపుర జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

భారత్ తరఫున 12 వన్డేలు, 9 టీ20 మ్యాచ్‌లు ఆడిన విజయ్ శంకర్, 2019 వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఆ టోర్నమెంట్‌లో పాకిస్థాన్‌పై తాను వేసిన మొదటి బంతికే వికెట్ తీసి అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ వంటి ఫ్రాంచైజీలకు ఆడాడు.

2025 ఐపీఎల్‌లో ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో, 2026 వేలంలో విజయ్ శంకర్ అమ్ముడుపోలేదు. తన కెరీర్‌లో సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నానని, అయినా సానుకూలంగా ముందుకు సాగుతానని తెలిపారు. రిటైర్మెంట్ ప్రకటనలో తనను తాను '3D క్రికెటర్' అని అభివర్ణించుకోవడం విశేషం. గతంలో విజయ్ శంకర్ ను వరల్డ్ కప్ కు ఎంపిక చేయడంపై విమర్శలు రాగా, అతడు మూడు కోణాల్లో ఉపయోగపడే త్రీడీ ఆటగాడు అని అప్పటి సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ సమర్థించుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో విజయ్ శంకర్ సేవలు జట్టుకు ఉపయోగపడతాయని వివరించాడు. 


Vijay Shankar
Indian Premier League
IPL
Tamil Nadu cricket
domestic cricket
MSK Prasad
3D cricketer
retirement
India cricket
T20

More Telugu News